Gongura Royyalu : మనం రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసే కూరలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల గోంగూర కూడా ఒకటి. గోంగూర, రొయ్యలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. కమ్మగా, రుచిగా ఉండే రొయ్యల గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల గోంగూర కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన రొయ్యలు – అరకిలో, గోంగూర – ఒక పెద్ద గుప్పెడు, పచ్చిమిర్చి – 5, తరిగిన టమాట – 1, ఉప్పు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ముప్పావు గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్.
రొయ్యల గోంగూర కర్రీ తయారీ విధానం..
ముందుగా రొయ్యలను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా శుభ్రం చేయాలి. తరువాత ఒక కళాయిలో శుభ్రం చేసిన రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. రొయ్యల్లో ఉండే నీరంతా పోయే వరకు రొయ్యలను చక్కగా వేయించాలి. తరువాత మరో గిన్నెలో పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులోనే టమాట ముక్కలు, గోంగూర వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత ఈ గోంగూరను పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి.
తరువాత మంటను చిన్నగా చేసి వేయించిన రొయ్యలు, గోంగూర వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల గోంగూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలతో తరచూ చేసే కూరలతో పాటు ఇలా గోంగూరను వేసి కూడా రుచిగా కూరను తయారు చేసుకుని తినవచ్చు.