Healthy Murukulu : మనం చేసుకునే పిండి వంటకాల్లో మురుకులు కూడా ఒకటి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే ఈ మురుకులను మనం ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మనం మురుకులను బియ్యంపిండితో తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండికి బదులుగా మనం జొన్నపిండితో కూడా మురుకులను తయారు చేసుకోవచ్చు. జొన్న పిండితో చేసే మురుకులు కూడా గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ జొన్న పిండి మురుకులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పిండి మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నపిండి – 3 కప్పులు, శనగపిండి – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, నువ్వులు – 2 టీ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వాము – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
జొన్న పిండి మురుకుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో శనగపిండి, బియ్యంపిండి వేసి కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. తరువాత తగినంత పిండిని ఉంచి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మురుకులను వత్తుకుని వేయించాలి. ఈ జంతికలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్నపిండి మురుకులు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా జొన్నపిండితో రుచికరమైన మురుకులను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.