ఎంతో రుచికరమైన.. తొందరగా చేసుకునే వంటకాలలో ఆలూ జీరా ఒకటి. జీలకర్రతో చేసే ఈ ఆలూ వేపుడు ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన ఆలూ జీరా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు 5, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ధనియాలు, ఉప్పు తగినంత, కారం ఒకటిన్నర స్పూన్, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులు 4, తగినన్ని నీళ్ళు, నూనె తగినంత.
కావలసిన పదార్థాలు
ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి జీలకర్ర, ధనియాలను ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలను పొడిగా చేసుకోవాలి. అదేవిధంగా బంగాళదుంపలను కడిగి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. బంగాళదుంపలు బాగా ఉడికిన తరువాత చల్లార్చి వాటిపై పొట్టుతీసి క్యూబ్ షేప్ లో కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌ పై బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పుదీనా వేసి కలియబెట్టాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసి మరోసారి కలియబెట్టాలి. ఇందులోకి తగినంత ఉప్పు కారం చిటికెడు పసుపు ముందుగా పొడి చేసుకున్న జీలకర్ర ధనియాల పొడి మిశ్రమాన్ని వేసి కలపాలి. రెండు నిమిషాలపాటు మగ్గిన తర్వాత కొత్తిమీర తురుము చల్లుకుని వేడి వేడిగా పరోటా లేదా పూరిలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.