Idli Karam Podi : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఇడ్లీలను మనం చట్నీ, సాంబార్ లతో కలిపి తింటాం. ఇవే కాకుండా వీటిని చాలా మంది కారం పొడితో కూడా తింటూ ఉంటారు. ఈ కారం పొడితో తినడం వల్ల కూడా ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కారం పొడిని మనం చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలను తినడానికి వాడే ఈ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 10 నుండి 15, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – 10 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత.
ఇడ్లీ కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఎండు మిరపకాయలను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. అదే కళాయిలో శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కరివేపాకు కరకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించిన తరువాత చింతపండును వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించిన ఎండుమిరపకాయలను, వెల్లుల్లి రెబ్బలను, తగినంత ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ కారం పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా ఉండేలా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల ఒక నెల వరకు తాజాగా ఉంటుంది. ఈ కారాన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.