Instant Badam Mix : బాదంపప్పు.. ఇది మనందరికి తెలిసిందే. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదంపప్పును నానబెట్టి తీసుకోవడంతో పాటు దీనితో మనం బాదం మిల్క్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. బాదం మిల్క్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ బాదంపాలను ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే బాదం పాలను తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే ఇది కొద్దిగా శ్రమతో కూడిన పని. అయితే బాదం మిక్స్ ను తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే 5 నిమిషాల్లో బాదం పాలను తయారు చేసుకోవచ్చు. ఈ బాదం మిక్స్ ను ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ బాదం మిక్స్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బాదం మిక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – అర లీటర్, బాదంపప్పు – ఒక కప్పు, జీడిపప్పు -15, పిస్తాపప్పు – 15, పంచదార – ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పులు, యాలకులు – 5, పసుపు – అర టీ స్పూన్, కుంకుమ పువ్వు – రెండు చిటికెలు.
ఇన్ స్టాంట్ బాదం మిక్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో బాదంపప్పు ఉంచి ఒక నిమిషం పాటు ఉంచాలి. తరువాత బాదం పప్పును వడకట్టి వాటపై ఉండే పొట్టును తీసేయాలి. తరువాత వీటిని ఒక కాటన్ వస్త్రంపై వేసి ఆరబెట్టుకోవాలి. ఆరిన బాదంపప్పును కళాయిలో వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. వీటిని దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో 15 బాదంపప్పులను, జీడిపప్పులను, పిస్తా పప్పులను వేసి వేయించాలి. వీటిని కూడా దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత జార్ లో పంచదార, యాలకులు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో వేయించిన బాదం పప్పు వేసి మధ్య మధ్యలో ఆపుతూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే కుంకుమ పువ్వు, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా బాదం మిక్స్ ను తయారు చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు బాదం పాలను తయారు చేసుకుని తాగవచ్చు. పిల్లలకు పాలల్లో బయట లభించే పొడులను కలిపి ఇవ్వడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తమయారు చేసుకున్న బాదం మిక్స్ ను కలిపి ఇవ్వవచ్చు. ఈ మిక్స్ తో చేసిన బాదం పాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు.