Instant Pulihora Powder : అన్నంతో చేసుకోదగిన రుచికరమైన రైస్ వెరైటీలల్లో పులిహోర కూడా ఒకటి. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. నైవేధ్యంగా సమర్పించడంతో పాటు దీనిని అల్పాహారంగా కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే చాలా మంది పులిహోరను తయారు చేసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని చాలా సమయంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విధంగా పులిహోర పొడిని తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు పులిహోరను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఇన్ స్టాంట్ పులిహోర పొడితో చచేసే పులిహోర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పొడి ఉంటే చాలు 5 నిమిషాల్లో పులిహోరను తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ పొడితో పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ పులిహోర పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీ గ్లాస్, మినపప్పు – అర టీ గ్లాస్, మెంతులు – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ గ్లాస్, ఎండుకొబ్బరి పొడి – ఒక టీ గ్లాస్, ఎండుమిర్చి – 10, చింతపండు – ఒక పెద్ద నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్, అన్నం – తగినంత.
ఇన్ స్టాంట్ పులిహోర పౌడర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు వేసి వేయించాలి. దీనిని చక్కగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మినపప్పు వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే నువ్వులను వేసి వేయించాలి. వీటిని చిటపటలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే ఎండుకొబ్బరి పొడిని, ఎండుమిర్చిని, చింతపండును కూడా విడివిడిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి మరీ మెత్తని పొడిగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పులిహోర పొడి తయారవుతుంది. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. తరువాత ఈ పొడితో పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, పల్లీలు వేసి వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పసుపు, కరివేపాకు, ఇంగువ వేసి కలపాలి. ఇలా తాళింపును సిద్దం చేసుకున్న తరువాత అన్నం వేసి కలపాలి. తరువాత రుచికి తగినంత పులిహోర పొడిని వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులిహోర తయారవుతుంది. ఈ విధంగా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో పులిహోర పొడితో చక్కటి రుచికరమైన పులిహోరను తయారు చేసి తీసుకోవచ్చు.