Karivepaku Karam Podi : మనం తాళింపులో ఉపయోగించే పదార్థాల్లో కరివేపాకు ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. కరివేపాకు చక్కటి వాసనను కలిగి ఉంటుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కడా పొందవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ ను తొలగించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, బరువు తగ్గేలా చేయడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో చేసే కారాన్ని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కరివేపాకుతో కారం పొడిని రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ముదురు కరివేపాకు – 50 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 20 లేదా తగినన్ని, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, చింతపండు – చిన్ననిమ్మకాయంత.
కరివేపాకు కారం పొడి తయారీ విధానం..
ముందుగా కరివేపాకును కడిగి నీడకు తడి లేకుండా ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తరువాత ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి మరో 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత జీలకర్ర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, పసుపు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కారం పొడిని గాజు సీసాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ కారం పొడి నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారం పొడి తయారవుతుంది.
దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కేవలం అన్నంతోనే కాకుండా అల్పాహారాలలో కూడా ఈ కారం పొడిని వేసుకుని తినవచ్చు. వంటల్లో వేసే కరివేపాకును తినని వారికి ఇలా కరివేపాకు కారం పొడి చేసిపెట్టడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.