మన దక్షిణ భారత దేశంలో వండే సంప్రదాయక వంటలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని దేవుడికి నైవేద్యం గా కూడా పెడతారు. అంతేకాదు వీటిలో మన ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయి. పూర్వ కాలం నుండి బియ్యం , పెసర పప్పు కలిపి పులగం లేదా దద్దోజనం వంటి ఆరోగ్యానికి ఉపయోగ పడే వంటలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి.
కారా పొంగల్ తయారికి కావలసిన పదార్థాలు:
1 కప్పు బియ్యం, ½ కప్పు పెసరపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ½ కప్పు తరిగిన కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి 5, అల్లం ,కరివేపాకు, జీడిపప్పు, దంచిన మిరియాలు 1స్పూన్, నెయ్యి 1 స్పూన్, ఉప్పు, పసుపు, నీళ్ళు, బియ్యం,పెసరపప్పు కలిపి ఉడికించి పెట్టుకోవాలి.
తయారి విధానం:
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి వెయ్యాలి. నెయ్యి వేడయ్యాక జీడి పప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. దానిలో అల్లం తరుగు , జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.తరువాత కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టిన అన్నం వేసి అందులో మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అన్ని కలిసేలా ఒక అయిదు నిమిషాలు సన్నని మంట పై వేయించాలి. చివరగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక దానిని జీడి పప్పు తో గార్నిష్ చేసి వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన కారా పొంగల్ రెడీ.