Kodiguddu Vellulli Karam : మనం కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూడా ఒకటి. వెల్లుల్లి కారం వేసి చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వంటచేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఈ కారాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈకోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 10 లేదా 12, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 3, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు, కోడిగుడ్లు – 4 లేదా 5, పసుపు – పావు టీ స్పూన్.
కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారీ విధానం..
ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత దంచిన వెల్లుల్లి కారం వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి చిన్న మంటపై వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వీటిని కళాయిలోనే పక్కకు అని కోడిగుడ్లను వేసుకోవాలి. ఈ కోడిగుడ్లు కొద్దిగా ఉడికిన తరువాత అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని మరో 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వెల్లుల్లి కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.