Kodo Millet Laddu : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటి వల్ల జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది. అయితే మందులను వాడే పనిలేకుండా వీటి నుంచి బయట పడాలన్నా.. లేదా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవాలన్నా.. ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించాలన్నా.. అందుకు చిరు ధాన్యాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో అరికెలు కూడా ఒకటి. వీటిని నేరుగా తినలేరు. అందువల్ల వీటితో లడ్డూలను తయారు చేసి రోజుకు ఒకటి తినవచ్చు. దీంతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక అరికెలతో లడ్డూలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరికెల లడ్డూలను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు..
అరికెల పిండి – 2 కప్పులు, పల్లీలు – అర కప్పు, నువ్వులు – అర కప్పు, బెల్లం – 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, బాదం పప్పు – అర కప్పు, నెయ్యి – 10 గ్రాములు.
అరికెల లడ్డూలను తయారు చేసే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి అయ్యిన నెయ్యిలో అరికెల పిండి వేసి వేయించాలి. తరువాత వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుమును వేరు వేరుగా వేయించుకోవాలి. వీటిని ఒక మిక్సి జార్లోకి తీసుకుని బెల్లం, అరికెల పిండి కలిపి మిక్సి పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసి వేడి చేసిన నెయ్యి వేస్తూ లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన అరికెల లడ్డూలు రెడీ అవుతాయి. వీటిని రోజుకు ఒకటి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక పోషకాలను పొందవచ్చు.