Kullad Lassi : కుల్లడ్ లస్సీ.. పెరుగుతో చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు వేసవి కాలంలో రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. దీనిని తాగడం వల్ల శరీరానికి వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ లస్సీని తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ లస్సీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ కుల్లడ్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుల్లడ్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, పటిక బెల్లం పొడి – రుచికి తగినంత, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ – తగినన్ని, పాల మీగడ – కొద్దిగా.
కుల్లడ్ లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని బాగా చిలకాలి. తరువాత ఇందులో పటిక బెల్లం పొడి, పాలు, రోజ్ వాటర్ వేసి మరోసారి బాగా చిలకాలి. తరువాత ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుల్లడ్ ను మట్టి గ్లాస్ లో పోసుకుని పైన పాల మీగడను వేసుకోవాలి. తరువాత దీనిపై రోజ్ సిరప్ ను, తరిగిన డ్రై ఫ్రూట్స్ ను, టూటీ ఫ్రూటీని చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కుల్లడ్ లస్సీ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.