Apollo Fish : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది చేపలు అంటే ఎంతో ఇష్టంగా తింటారు. చేపలను వేపుడు, పులుసు చేసుకుని తింటారు. అయితే చేపలతో మనం అపోలో ఫిష్‌ను కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువగా బయట రెస్టారెంట్లలో లభిస్తుంది. కాస్త శ్రమించాలే కానీ దీన్ని ఇంట్లోనూ ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇక అపోలో ఫిష్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అపోలో ఫిష్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – 2 రెబ్బలు, పచ్చిమిరప కాయలు – 3, నూనె – తగినంత, అల్లం, వెల్లుల్లి తరిగిన ముక్కలు – 1 టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఎండు కారం – 1 టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, కోడిగుడ్డు – 1, మైదా పిండి – 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్, కొర్రమీను చేపల ముక్కలు – 250 గ్రాములు, పచ్చి మిరపకాయల పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, సోయా సాస్ – 1 టీస్పూన్, పెరుగు – పావు కప్పు, నల్ల మిరియాల పొడి – అర టీస్పూన్, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్.
అపోలో ఫిష్ ను తయారు చేసే విధానం..
ఒక పాత్రలో చేప ముక్కలను తీసుకుని అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, నిమ్మరసం వేసి చేప ముక్కలను బాగా కలపాలి. అనంతరం అందులో కోడిగుడ్డు కొట్టి, కార్న్ ఫ్లోర్, మైదా పిండి వేసి బాగా కలపాలి. ఆ తరువాత చేప ముక్కలను మీడియం మంటపై డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఫ్రై అయిన చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత పాన్ తీసుకుని నూనె వేసి వేడెక్కాక అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరప కాయ ముక్కలు, కరివేపాకులు, పచ్చి మిరపకాయల పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, సోయా సాస్, పెరుగు, మిరియాల పొడి, కొత్తిమీర ఆకులు వేసి కొంత సేపు వేయించాలి. అనంతరం అందులో అంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి బాగా వేయించాలి. అనంతరం ముక్కలపై నిమ్మరసం పిండాలి. దీంతో రుచికరమైన అపోలో ఫిష్ తయారవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా భోజనంతోపాటుగా కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.