Atukula Dosa : అటుకులను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో పోహా.. చుడువా.. వంటివి చేసుకుని తింటుంటారు. అటుకులు చాలా తేలికైన పదార్థాల్లో ఒకటి. కనుక ఇవి ఎవరికైనా సరే చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇక అటుకులతో మనం దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. శరీరానికి శక్తిని ఇస్తాయి. చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. ఇక అటుకులతో దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కప్పు, బియ్యం – కప్పు, మినప పప్పు – రెండు టేబుల్ స్పూన్లు, మెంతులు – అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – కప్పు.
అటుకుల దోశను తయారు చేసే విధానం..
అటుకులు, బియ్యం, మెంతులను గిన్నెలో వేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి. పెరుగులో కొన్ని నీళ్లు పోసి గిలకొట్టి దీంట్లో అటుకులు, బియ్యం వేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఉప్పు వేసి దోశ పిండిలా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ ఆరు గంటల పాటు నానబెట్టాలి. పెనం మీద నూనె పోసి వేడి చేసి దోశ వేయాలి. మధ్యస్థంగా ఉండే మంటపై దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో రుచికరమైన అటుకుల దోశలు తయారవుతాయి. వీటిని పల్లీలు లేదా టమాటా చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.