Masala Mirchi Bajji : మనకు సాయంత్రం సమయాల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో మిర్చి బజ్జీ కూడా ఒకటి. మిర్చి బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బజ్జీలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడూ వీటిని తయారు చేస్తూ ఉంటాం. సాధారణ మిర్చీ బజ్జీలే కాకుండా మనం మసాలా మిర్చీ బజ్జీని కూడా తయారు చేస్తూ ఉంటాం. మసాలా మిర్చి బజ్జీలు సాధారణ బజ్జీల కంటే మరింత రుచిగా ఉంటాయి. ఈ మసాలా మిర్చి బజ్జీలను హైదరాబాద్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మిర్చీ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – 50 గ్రా., జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నల్ల ఉప్పు – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, బజ్జీ మిర్చి – 15, శనగపిండి – ఒకటిన్నర కప్పు, వాము – ఒక టీ స్పూన్, వంటసోడా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 225 ఎమ్ ఎల్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మసాలా మిర్చీ బజ్జీ తయారీ విధానం..
ముందుగా చింతపండు నుండి చిక్కటి గుజ్జును తీసుకోవాలి. తరువాత అందులో జీలకర్ర పొడి, ఉప్పు, నల్ల ఉప్పు, కారం వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో శనగపిండి, వాము, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత బజ్జీ మిర్చిని తీసుకుని వాటి కింది వైపు ఒక అంగుళం పొడవుతో కట్ చేయాలి. తరువాత మిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని రాయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పొడవుగా ఉండే గ్లాస్ లో శనగపిండిని తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిర్చిని పిండిలో ముంచాలి.
తరువాత దీనికి ఒక వైపు పిండి తక్కువగా ఉండేలా గ్లాస్ అంచుకు తాకుతూ మిర్చిని బయటకు తీసి నూనెలో వేసుకోవాలి. తరువాత వీటిని రంగు మారే వరకు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి క్రిస్పీ అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా మిర్చి బజ్జీ తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా టమాట కిచప్ తో లేదా టమాట చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా సాయంత్రం సమయాల్లో అప్పుడప్పుడూ ఇలా మసాలా మిర్చి బజ్జీని తయారు చేసుకుని తినవచ్చు.