వంకాయలతో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వంకాయల్లో మనకు అనేక రకాలు లభిస్తుంటాయి. వీటితో చేసే ఏ వంటకం అయినా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నూనె వంకాయ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా దీన్ని రెస్టారెంట్లలోనే వండుతారు. కానీ కాస్త శ్రమిస్తే ఎంతో రుచిగా ఇంట్లోనూ నూనె వంకాయను వండుకోవచ్చు. ఈ క్రమంలోనే నూనె వంకాయ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నూనె వంకాయ తయారీకి కావలసిన పదార్థాలు..
ఉల్లిపాయలు 1/4 కిలో, టమోటాలు 1/4 కిలొ, గుత్తి వంకాయలు 1/2 కిలో, శనగ గుండ్లు 1/2 కప్పు, పచ్చి పప్పు 1/4 కప్పు, ధనియాలు 1/4 కప్పు, పుట్నాల పప్పు 1/4 కప్పు, ఎండు మిర్చి 6 కాయలు, ఉప్పు తగినంత, నువ్వులు 1/4 కప్పు, నూనె 1/4 కప్పు, పోపు గింజలు, తగినన్ని, పసుపు 1 టీస్పూన్, కొత్తిమీర 2 చిన్న కట్టలు.
తయారు చేయు విధానము :
ముందుగా కూరలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి(గుత్తి వంకాయల్లాగానే). ఇప్పుడు శనగపలుకులు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులు ఒక బాణెలిలో వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక ,పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి, వంకాయలు ఉడికి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. తర్వాత ఇందాక పక్కన పెట్టిన పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకోవాలి.