పల్లీలు, కొబ్బరి మన ఇండ్లలో ఎప్పుడూ ఉంటాయి. ఏదో ఒక వంటకంలో మనం వీటిని వేస్తూనే ఉంటాం. పల్లీలు, కొబ్బరిని కొందరు నేరుగా అలాగే తింటుంటారు. కొందరు వేయించి తింటారు. బెల్లంతో కలిపి వీటిని తింటే వచ్చే రుచే వేరు. అయితే ఈ రెండింటినీ కలిపి మనం లడ్డూలను కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ క్రమంలోనే పల్లీలు, కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేయాలో, వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి – ఒక కప్పు, నువ్వులు – అర కప్పు, బెల్లం పొడి – కప్పు, శొంఠి పొడి – పావు టీస్పూన్, నెయ్యి – అర కప్పు.
పల్లీలు కొబ్బరి లడ్డూలను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలు, నువ్వులను విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. పల్లీల పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసి బరకగా పొడి చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలను కూడా వేసుకుని మరోసారి కలపాలి. ఈ మిశ్రమంలో కరిగించిన నెయ్యి వేస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే పల్లీలు, కొబ్బరి లడ్డూలు రెడీ అవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.