Pesara Pappu Vada : పెసరపప్పు అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీంతో పప్పు, చారు వంటివి చేస్తారు. కొందరు చిరుతిళ్లను కూడా చేసి తింటారు. అయితే పెసర పప్పుతో ఎంతో రుచిగా ఉండే వడలను చేసుకోవచ్చు. వీటిని చేయడం ఎంతో సులభం. అందరూ ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే పెసర పప్పుతో వడలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – 1 కప్పు, పచ్చి మిర్చి – 2 లేదా 3, అల్లం – 1 ఇంచు ముక్క (సన్నగా తరగాలి), ఉల్లిపాయ – 1 (చిన్నది, సన్నగా తరగాలి), కొత్తిమీర ఆకులు – గుప్పెడు, జీలకర్ర – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
![Pesara Pappu Vada : పెసరపప్పుతో ఇలా వడలను చేసి వేడిగా తినండి.. ఎంతో బాగుంటాయి..! Pesara Pappu Vada recipe very easy to make](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2023/07/pesara-pappu-vada.jpg)
పెసర పప్పు వడలను తయారు చేసే విధానం..
పెసర పప్పును నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తరువాత పప్పును నీటిలో వేసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. పప్పు నానిన తరువాత నీళ్లను వంపేయాలి. బ్లెండర్‌లో నానబెట్టిన పెసర పప్పు, పచ్చి మిర్చి, అల్లం వేసి నీళ్లు వేయకుండా పిండి పట్టాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకులు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. స్టవ్‌పై కడాయి పెట్టి అందులో నూనె పోసి మీడియం మంటపై కాగబెట్టాలి. నూనె కాగిన తరువాత పిండిని తీసుకుని చిన్నపాటి వడల్లా తయారు చేసి వాటిని నూనెలో వేసి వేయించాలి.
వడలను ఒక ప్లాస్టిక్ షీట్ లేదా అరటి ఆకుపై తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వడలను నూనెలో వేసి వేయించి బంగారు రంగు వచ్చే వరకు ఉంచి తీయాలి. ఇలా అన్ని వడలను వేయించాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు వడలు రెడీ అవుతాయి. ఇలా వడలను తయారు చేసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తినవచ్చు. ఏదైనా చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఈ వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరూ వీటిని ఇష్టపడతారు.