Poha Dosa : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అటుకులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. కేవలం చిరుతిళ్లనే కాకుండా అటుకులతో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎప్పుడూ ఒకేరకం దోశలు తిని తిని బోర్ కొట్టిన వారు ఇలా అటుకుల దోశలను ట్రై చేయవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ అటుకుల దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ పోహా దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, అటుకులు – అర కప్పు, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్స్, పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా, వంటసోడా- పావు స్పూన్.
క్రిస్పీ పోహా దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని, అటుకులను, మినపప్పును తీసుకుని శుభ్రంగాకడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చిలకాలి. తరువాత నీళ్లు పోసి మజ్జిగలాగా చేసుకోవాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని మరలా మజ్జిగలో వేసి మరో 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మజ్జిగతో సహా జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశను మధ్యస్థ మంటపై నూనె వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే అటుకుల దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేరకం దోశలు కాకుండా అప్పుడప్పుడూ ఇలా అటుకులతో కూడా దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.