Ragi Murukulu : చిరు ధాన్యాల్లో ఒకటైన రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. రాగులను పిండిగా చేసి దాంతో జావ లేదా సంకటి లేదా రొట్టెలను తయారు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రాగులు మన శరీరానికి చలువ చేస్తాయి. శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గిస్తాయి. కనుకనే రాగుల జావను వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. అయితే రాగులతో కేవలం ఇవే కాకుండా.. ఎంతో రుచిగా ఉండే మురుకులను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగుల మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – అర కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, శనగపిండి – 1 టేబుల్ స్పూన్, వేడి నూనె – 1 టీస్పూన్, ఇంగువ – పావు టీస్పూన్, వాము – పావు టీస్పూన్, నువ్వులు – 2 టీస్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా, కారం – కొద్దిగా.
రాగుల మురుకులను తయారు చేసే విధానం..
ముందుగా ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ వేడి నూనె వేసి మరోసారి కలిపి నీళ్లు పోసుకుంటూ మురుకుల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మురుకుల గొట్టంలో తీసుకుని కాగుతున్న నూనెలో మురుకుల్లా వత్తుకుని ఎర్రగా వేయించుకుని తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే రాగుల మురుకులు రెడీ అవుతాయి. ఎప్పుడూ చేసే మురుకులకు బదులుగా ఒక్కసారి ఇలా రాగులతో మురుకులను తయారు చేయండి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.