ఏవైనా పండుగలు వచ్చాయంటే చాలు. చాలా మంది తినుబండారాలను చేస్తుంటారు. ముఖ్యంగా స్వీట్లను తయారు చేసి తింటుంటారు. అయితే బియ్యం పిండితో చాలా మంది అనేక రకాల స్వీట్లను చేస్తుంటారు. వాటిల్లో హల్వా కూడా ఒకటి. బియ్యం పిండితోనూ హల్వాను తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ ఎంతో రుచిగా ఉండే హల్వా రెడీ అవుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, చిక్కని కొబ్బరిపాలు – ఒక కప్పు, పలుచని కొబ్బరిపాలు – మూడు కప్పులు, యాలకుల పొడి – ఒక టీస్పూన్, నెయ్యి – పావు కప్పు, జీడిపప్పు పలుకులు – పావు కప్పు.
బియ్యం పిండి హల్వా తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో పలుచని కొబ్బరిపాలు, బెల్లం తరుగు వేసుకుని స్టవ్‌ని సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగాక బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కలపాలి. తరువాత ఇందులో చిక్కని కొబ్బరిపాలు పోసి కలుపుతూ ఉండాలి. అయిదు నిమిషాలు అయ్యాక యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు పలుకులూ మిగిలిన నెయ్యి వేసి కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పరిచి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కట్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి హల్వా రెడీ అయినట్లే. దీన్ని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.