Shanagala Vadalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగలు కూడా ఒకటి. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ శనగలతో మనం ఎక్కువగా గుగ్గిళ్లను, కూరను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా శనగలతో మనం ఎంతో రుచిగాఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగల వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా కరకరలాడుతూ ఉండే శనగల వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల వడలు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన శనగలు – ఒకటిన్నర కప్పు, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత,చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
శనగల వడలు తయారీ విధానం..
ముందుగా జార్ లో నానబెట్టిన శనగలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పిండిని తగిన మోతాదులో తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ అరటి ఆకు మీద లేదా ప్లాస్టిక్ కవర్ మీద వడ లాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో శనగలతో ఇలా వడలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.