Sponge Dosa Recipe : మనం ఉదయం అల్పాహారంగా రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో దోశ ఒకటి. ఈ దోశను ఇష్టపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మన రుచికి తగినట్టు మం రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ దోశ పిండిని మనం ఒక రోజూ ముందే తయారు చేసి పెట్టుకోవాలి. అప్పుడే దోశలు రుచిగా ఉంటాయి. అయితే దోశ పిండిని తయారు చేసే సమయం ఒక్కోసారి మనకు ఉండదు. అలాంటప్పుడు ఇన్ స్టాంట్ గా కూడా మనం దోశలను వేసుకుని తినవచ్చు. ఈ దోశలను తయారు చేయడానికి పప్పును నానబెట్టి రుబ్బే పని అసలే లేదు. రుచిగా అప్పటికప్పుడు దోశను అలాగే దానిలోకి టమాట చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పాంజ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెండ్ స్లైసెస్ – 5, బొంబాయి రవ్వ – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, ఉప్పు- తగినంత, నీళ్లు – ఒకటిన్నర కప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – పావు టీ స్పూన్.
టమాట చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 6 లేదా తగినన్ని, తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 2, చింతపండు రసం – కొద్దిగా.
స్పాంజ్ దోశ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ ను తీసుకుని వాటికి చుట్టూ ఉండే నల్లటి భాగాన్ని తీసివేయాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే రవ్వ, బియ్యం పిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశ లా వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనెను వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పాంజ్ దోశ తయారవుతుంది.
టమాట చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని తాళింపు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చట్నీ తయారవుతుంది. ఈ విధంగా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే స్పాంజ్ దోశను, టమాట చట్నీని తయారు చేసుకుని తినవచ్చు. దోశ పిండిని తయారు చేసే సమయం లేని వారు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే స్పాంజ్ దోశను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.