Stuffed Egg Paratha : కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో స్టఫ్డ్ ఎగ్ పరోటా కూడా ఒకటి. ఈ పరోటా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా కూడా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ ఎగ్ పరోటాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టఫ్డ్ ఎగ్ పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, కోడిగుడ్లు – 2, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ లేదా తగినంత.
స్టఫ్డ్ ఎగ్ పరోటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. తరువాత గిన్నెలో కోడిగుడ్లును వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత పిండిని మరోసారి మెత్తగా కలుపుకుని మూడు లేదా నాలుగు సమభాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కంటే కొద్దిగా మందంగా ఉండేలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక వత్తుకున్న చపాతీని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చపాతీ కాలగానే చక్కగా పొంగుతుంది.
ఇలా చపాతీ రెండు పొరలుగా అవ్వగానే కత్తితో దానికి చిన్న రంధ్రం చేసి అందులో ముందుగా కలిపి ఉంచిన కోడిగుడ్డు మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత దీనిని నూనె వేస్తూ కోడిగుడ్డు మిశ్రమం గట్టి పడే వరకు ఒక వైపు కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పి నూనె వేసి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ ఎగ్ పరోటా తయారవుతుంది. దీనిని ముక్కలుగా చేసుకుని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా ఇలా ఎగ్ పరోటాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.