Talbina : తల్బినా.. బార్లీ గింజలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఇలా అనేక రకాలుగా తల్బినా మనకు దోహదపడుతుంది. ఈ తల్బినాను తయారు చేసుకోవడం చాలా సులభం. బార్లీ గింజలు ఉంటే చాలు దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ తల్బినాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తల్బినా తయారీకి కావల్సిన పదార్థాలు..
బార్లీ – ఒక కప్పు, పాలు – ఒక లీటర్, కుంకుమ పువ్వు – చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, తరిగిన ఖర్జూర పండ్లు – రుచికి తగినన్ని.
తల్బినా తయారీ విధానం..
ముందుగా బార్లీ గింజలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. బార్లీ గింజలు చక్కగా నానిన తరువాత ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక కుంకుమ పువ్వు, బార్లీ గింజలను వేసి చిన్న మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బార్లీ గింజలు ఉడికిన తరువాత డ్రై ఫ్రూట్స్, ఖర్జూర పండ్లు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా మరోసారి స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. తరువాత దీనిని గిన్నెలోకి తీసుకుని పైన తేనె వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తల్బినా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా బార్లీ గింజలతో చేసిన ఈ తల్బినాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.