Thoka Bundi : తోక బూందీ.. తమిళనాడులో చేసే రుచికరమైన తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. తోక బూందీ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా పండగలకు, శుభకార్యాలకు దీనిని తయారు చేస్తూ ఉంటారు. ఈ బూందీ పొడవుగా ఉంటుంది. మనం చేసుకునే బూందీలాగా గుండ్రంగా ఉండదు. బూందీ గంటెలేకపోయినా కూడా ఈ బూందీని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ తోక బూందీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోక బూందీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార- 2కప్పులు, నీళ్లు – ఒక కప్పు, పాలు – 2 టేబుల్ స్పూన్స్, ఎల్లో ఫుడ్ కలర్ – 2 చుక్కలు, శనగపిండి -ఒక కప్పు, బియ్యంపిండి – అర కప్పు, వంటసోడా – అర టీ స్పూన్.
తోక బూందీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత పాలు, ఫుడ్ కలర్ వేసి కలపాలి. పంచదార పాకంపై ఏర్పడిన నురుగును తీసేసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి, వంటసోడా వేసి కలపాలి.తరువాత నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మరీ జారుడుగా కాకుండా కలుపుకోవాలి. ఒక కప్పు కంటే కొద్దిగా నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పెద్ద చిల్లుల గంటెను తీసుకుని పిండివేసి చేత్తో రుద్దాలి.
తరువాత బూందీని మధ్యస్థ మంటపై వేయించాలి. బూందీ క్రిస్పీగా వేగిన తరువాత గంటెతో తీసి వేడిగా ఉన్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ బూందీని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి తరువాత గిన్నెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోక బూందీ తయారవుతుంది. బూందీ వేసిన ప్రతిసారి పాకం వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోక బూందీ తయారవుతుంది. ఈ బూందీ 10 రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.