Tirumala Vada : తిరుమలలో శ్రీవారికి నైవేధ్యంగా సమర్పించే వాటిల్లో వడలు కూడా ఒకటి. ఈ వడలు చాలా పెద్దగా పలుచగా ఉంటాయి. ఈ వడలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వడలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. తిరుమలలో స్వామి వారికి నైవేథ్యంగా సమర్పించే వడలను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినుములు – అరకిలో, మిరియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తిరుమల వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినుములను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వాటిలో తగినన్ని నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మినుములను జార్ లో వేసి నీళ్లు పోయకుండా గట్టిగా మిక్సీ పట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక రోట్లో మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత వీటిని కూడా పిండిలో వేసి కలపాలి. ఇప్పుడు చేయంతా పరిమాణంలో వడ వచ్చేలా తగినంత పిండిని తీసుకుని తడి చేసిన కాటన్ వస్త్రంపై లేదా పాలిథిన్ కవర్ పై ఉంచి చేత్తో వడలా పలుచగా వత్తుకోవాలి. మధ్య మధ్యలో చేతికి తడి చేసుకుంటూ వత్తుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడను నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ వడలు కాల్చడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఇలా చేయడం వల్ల తిరుపతి వడలు తయారవుతాయి. ఇవి మూడు నుండి రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ వడలు రుచిగా ఉన్నప్పటికి తిరుపతిలో చేసే ప్రసాదం వడల రుచి వీటికి రాదనే చెప్పవచ్చు.