Tomato Pachi Mirchi Pachadi : మనం వంటింట్లో టమాటాలను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. కూరలు, పచ్చళ్లు చేయడానికి ఎక్కువగా పండు టమాటాలను ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం పండు టమాటాలతోనే కాకుండా పచ్చి టమాటాలతో కూడా మనం రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పచ్చి టమాటాలతో చేసే ఈ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పచ్చి టమాటాలతో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారీ విధానం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చి టమాటాలు – 4 (మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 10 నుండి 15, వెల్లుల్లి రెబ్బలు – 3, చింతపండు – 5 గ్రాములు, పెద్దగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారీ విధానం..
ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి గాను ముందు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి కళాయిపై మూతను ఉంచి వేయించుకోవాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. టమాట ముక్కలు పూర్తిగా వేగిన తరువాత అందులో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిన తరువాత వీటిని రోట్లో వేసి రుబ్బుకోవాలి.
ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేసి దంచుకోవాలి. తరువాత చింతపండును వేసి దంచుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత టమాట ముక్కలను, పచ్చిమిర్చిని వేసి దంచుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని తరిగిన కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చిమిర్చి పచ్చడి తయారవుతుంది.
రోలు అందుబాటులో లేనివారు ఈ పచ్చడిని జార్ లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే పచ్చి టమాటాలకు బదులుగా దోరగా పండిన టమాటాలను వేసి కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల తినే కొద్ది తినాలనిపిస్తుంది.