Ulli Pachadi : ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం చేసే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయలేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. కేవలం వంటల్లో వాడడమే కాకుండా ఉల్లిపాయలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఉల్లిపాయలతో పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఉల్లిపాయలతో రుచిగా, తేలికగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – రెండు టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఎండుమిర్చి – 8, కరివేపాకు – ఒక రెమ్మ, చింతపండు – నిమ్మకాయంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత చింతపండు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కారం, ఉప్పు వేసి కలపాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ దినుసులన్నింటిని కూడా జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఈ పచ్చడిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో పాటు అల్పాహారాలతో కూడా తింటే చాలా రుచిగా ఉంటుంది.