Veg Bhurji : మనందరికి ఎగ్ బుర్జీ గురించి తెలిసిందే. కోడిగుడ్లతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ ఇలా దేనితోనైనా తినడానికి వీలుగా ఉంటుంది. ఎగ్ బుర్జీనే కాకుండా మనం వెజిటబుల్ బుర్జీని కూడా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉపయోగించకుండా చేసే ఈ వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లను తినని వారు ఇలా వెజిటేబుల్ బుర్జీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా, సులభంగా తయారు చేసుకోగలిగే ఈ వెజిటేబుల్ బుర్జీ తయారీ విధానాన్ని మరియు తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ బుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం తురుము – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, సన్నని ఉల్లిపాయ తరుగు – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నిమ్మకాయ – అర చెక్క.
వెజ్ బుర్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండి, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండి కంటే పలుచగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, అల్లం తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు పింక్ రంగులోకి మారగానే చిన్నగా తరిగిన టమాటాలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న శనగపిండిని మరోసారి కలిపి కళాయిలో దిబ్బ రొట్టెలా వేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి.
తరువాత మూత తీసి మధ్య మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేసి మరలా మూతను ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి మంటను పెద్దగా చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ శనగపిండి మిశ్రమాన్ని మరో వైపుకు తిప్పుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత ముక్కలుగా చేసుకుంటూ మరో 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మకాయరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెజ్ బుర్జీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడు ఇలా కూడా వెజ్ బుర్జీని తయారు చేసుకుని తినవచ్చు.