Veg Rice Recipe : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో, రెస్టారెంట్ లభించే వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో మనందరికి తెలిసిందే. పెద్దలతో పాటు పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను బయట లభించే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్ ను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బాస్మతీ బియ్యం – 200 గ్రా., చిన్నగా తరిగిన క్యారెట్ – 1, తరిగిన క్యాప్సికం – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన బీన్స్ – 10, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, సోయా సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా – అర టీ స్పూన్.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్, క్యాప్సికం, బీన్స్ ముక్కలను వేసి వేయించాలి. ఇందులోనే కరివేపాకును కూడా వేసి వేయించాలి. ఈ కూరగాయ ముక్కలను పూర్తిగా ఉడికించకూడదు. ఇవి సగం వేగిన తరువాత పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని, తగినంత ఉప్పును వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత సోయా సాస్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిలో ఇతర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. రుచిగా తినాలనిపించినప్పుడు లేదా ఏ వంట చేయాలో తెలియనప్పుడు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.