Watermelon Sharbat : పుచ్చకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వైద్యులు కూడా దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. వేసవికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన పండ్లల్లో ఇది కూడా ఒకటి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో, బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా పుచ్చకాయ మనకు సహాయపడుతుంది. వేసవికాలంలో ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి అలాగే ఆరోగ్యానికి మేలు కలిగేలా ఈ పుచ్చకాయతో మనం చల్లటి షర్బత్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఈ షర్బత్ ను సులభంగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయతో చల్ల చల్లగా షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్ మెలన్ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుచ్చకాయ ముక్కలు – ఒక కప్పు, తాజా పుదీనా ఆకులు – 5 నుండి 7, పంచదార – 2 స్పూన్స్, మిరియాల పొడి – చిటికెడు, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్.
వాటర్ మెలన్ షర్బత్ తయరీ విధానం..
ముందుగా ఒక జార్ లో పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులు, పంచదార, మిరియాల పొడి, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గ్లాస్ లో సబ్జా గింజలను తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న జ్యూస్ ను పోయాలి. తరువాత మరికొన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాటర్ మెలన్ షర్బత్ తయారవుతుంది. దీనిని అందర ఎంతో ఇష్టంగా తాగుతారు. వేసవికాలంలో ఇలా చల్ల చల్లగా పుచ్చకాయతో షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.