Wheat Flour Cake : కేక్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కేక్ ను తయారు చేయడానికి మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండి మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది కనుక మనం మైదా పిండికి బదులుగా గోధుమపిండితో కూడా కేక్ ను తయారు చేసుకోవచ్చు. అలాగే కోడిగుడ్లు, పెరుగు, బేకింగ్ పౌడర్ లేకుండా కూడా మనం ఈ కేక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో గోధుమపిండితో రుచికరమైన కేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పిండి కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు , పంచదార – ముప్పావు కప్పు, యాలకులు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ముప్పావు కప్పు నుండి ఒక కప్పు.
గోధుమపిండి కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పంచదార, యాలకులు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులోనే మిక్సీ పట్టుకున్న పంచదార పొడి, ఉప్పు, బేకింగ్ సోడా, నూనె వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ మివ్రమం గంటె జారుడుగా ఉండేలా చూసుకుని గిన్నెను పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో స్టాండ్ ను ఉంచాలి. ఈ స్టాండ్ పై మూతను ఉంచి విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత ఇంట్లో చిన్న గ్లాసులను తీసుకోవాలి. వీటిని లోపల నూనె లేదా నెయ్యి రాయాలి. నూనె రాసిన తరువాత వాటిపై గోధుమపిండిని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ గ్లాసులకు అతుక్కుపోకుండా ఉంటుంది.
తరువాత ఈ గ్లాసులల్లో మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ముప్పావు వంతు వరకు నింపుకోవాలి. తరువాత వీటిని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ లో ఉంచి విజిల్ లేకుండా మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించుకోవాలి. 15 నిమిషాల తరువాత కేక్ లో టూత్ పిక్ ను గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు ఏమి అంటుకుపోకుండా ఉంటే కేక్ ఉడికినట్టుగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గ్లాస్ లను బయటకు తీసి అంచులను చాకుతో వేరు చేసి కేక్ ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి కేక్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కేక్ ను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.