Poori Curry : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలను తినడానికి చేసే కూర బాగుంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. ఈ కూరను మనం శనగపిండిని ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాం. అయితే శనగపిండికి బదులుగా పుట్నాల పొడిని వేసి కూడా మనం పూరీ కూరను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. పుట్నాల పొడిని వేసి పూరీ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 5 లేదా రుచికి తగినన్ని, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), చిన్నగా తరిగిన బంగాళాదుంప – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, పుట్నాల పప్పు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పూరీ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ఆవాలను, ఎండు మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను, బంగాళాదుంపను, పసుపును, ఉప్పును వేసి కలిపి అవి మునిగే వరకు నీళ్లను పోసి మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో పుట్నాల పప్పును వేసి మెత్తగా పొడి చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ పొడిలో తగినన్ని నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బంగాళాదుంప ముక్కలు ఉడికిన తరువాత అందులో వేసి కలిపి మధ్యస్థ మంటపై 2 నిమిషాల పాటు ఉడికించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ కూర తయారవుతుంది. తరచూ శనగపిండిని వేసి చేసే పూరీ కూరకు బదులుగా ఇలా పుట్నాల పొడిని వేసి చేసే పూరీ కూర కూడా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన పూరీ కూరతో పూరీలను కలిపి తినడం వల్ల చాలా రుచిగా ఉంటాయి.