Zarda Pulao : ముస్లింల ఫంక్షన్ లలో ఎక్కువగా సర్వ్ చేసే వంటకాల్లో జర్దా పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ తియ్యగా, పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎంతో కలర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ పులావ్ 2 నుండి 3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో కమ్మగా ఉండే ఈ జర్దా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జర్దా పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – లీటర్నర, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, రెడ్ ఫుడ్ కలర్ – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నెయ్యి – అర కప్పు, జీడిపప్పు – పావు కప్పు, తరిగిన బాదంపప్పు – 8, ఎండు ద్రాక్ష – పావు కప్పు, ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – ముప్పావు కప్పు, గులాబ్ జామున్ – పెద్దది ఒకటి, రసగుల్లా – ఒకటి, చెర్రీస్ – 4.
జర్దా పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఫుడ్ కలర్ వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బాస్మతీ బియ్యం వేసి కలపాలి. వీటిని 80 శాతం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ అన్నాన్ని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే గిన్నెలో ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక లేయర్ గా వేసుకోవాలి. తరువాత దీనిపై పావు కప్పు పంచదార, కొన్ని వేయించిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి.
3 లేయర్స్ గా అన్నాన్ని వేసుకున్న తరువాత చివరగా పైన డ్రై ఫ్రూట్స్ తో పాటు గులాబ్ జామున్, రసగుల్లాను ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే చెర్రీస్ ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై టిష్యూ పేపర్ లను ఉంచి పైన నీటిని చల్లుకోవాలి. తరువాత మూత పెట్టి 6 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై, 7 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జర్దా పులావ్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన జర్దా పులావ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.