కరోనా ప్రభావం తగ్గడం, నిత్యం నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పడిపోవడంతో.. కరోనా ఇక లేదని, అంతం అవుతుందని అందరూ భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గత వారం, పది రోజుల నుంచి నిత్యం నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
కాగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్రలో ఇప్పటికే మళ్లీ కఠిన ఆంక్షలను విధించారు. పలు జిల్లాలు, నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూను విధించారు. రాత్రిపూట కఠినమైన లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఇక పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తుంటే మరోవైపు సీసీఎంబీ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ చెప్పారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌కు గాను 7వేలకు పైగా ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్) ఉన్నాయని చెప్పారు. అంటే కరోనా 7వేల రకాలుగా మార్పులకు గురైనట్లు స్పష్టమవుతుంది. ఇది ప్రస్తుతం సైంటిస్టులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇక సదరు 7వేల మ్యుటేషన్లలో కొన్ని మ్యుటేషన్లు తీవ్రమైన ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. వాటిల్లో 5వేల రకాలకు చెందిన కరోనా వైరస్‌లపై సైంటిస్టులు సమగ్రంగా పరిశీలన చేశారు. ఈ క్రమంలోనే కరోనా ఏవిధంగా మార్పు చెందింది.. అనే వివరాలను సీసీఎంబీ సైంటిస్టులు అధ్యయనం చేశారు. వాటితో కూడిన పరిశోధనా పత్రాలను వారు ప్రచురించారు.
కాగా సదరు 7వేల ఉత్పరివర్తనాల్లో ఎన్440కే అనే పేరున్న కరోనా వైరస్ రకం మన దేశంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు తెలిపారు. ముఖ్యంగా ఎన్440కే రకం కరోనా వైరస్ దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలియజేశారు.
ఇక ప్రతి వైరస్ మ్యుటేషన్‌ను కొత్త వైరస్‌గా చెప్పలేమని, కానీ వైరస్‌లకు సంబంధించి జన్యు సమాచారాన్ని కనుక్కోవడంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కాస్తంత వెనుకబడే ఉందని చెప్పవచ్చని అన్నారు. కాగా దేశంలో ఇప్పటి వరకు సుమారుగా 1 కోటి కరోనా కేసుల్లో 6400 వరకు జీనోమ్‌లను కనుక్కున్నామని ఆయన తెలిపారు. అయితే ఎన్440కే రకం కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనని, కరోనా పూర్తిగా అంతమైందని అప్పుడే భావించవద్దని అన్నారు. ఇక ప్రస్తుతం దేశంలో అనేక నగరాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో సెకండ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.