గత ఏడాదిన్నర కాలంగా భారత దేశంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోది. ఈ క్రమంలోనే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
క్లినికల్ అండ్ డయాగ్నస్టిక్ రీసెర్చ్ కు చెందిన జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం భారతీయుల్లో ప్రస్తుతం యువతలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారని వెల్లడించారు.
ప్రపంచంలో ఇతర దేశాలకు చెందిన వారికన్నా 8-10 ఏళ్లు ముందుగానే భారతీయులకు గుండె జబ్బులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యువత ఎక్కువగా 40 శాతం వరకు గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు తేలింది. 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారికి కూడా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు.
గుండె జబ్బులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వంశ పారంపర్యంగా గుండె జబ్బులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కుటుంబంలోని పెద్దలకు ఎవరికైనా గతంలో గుండె జబ్బులు వచ్చి ఉంటే వారి పిల్లలకు యుక్త వయస్సులోనే ఆ జబ్బులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
ఇక అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్నవారు, పొగ తాగేవారికి, ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నవారికి, నిత్యం కూర్చుని పనిచేసేవారికి, డయాబెటిస్, హైబీపీ, అధిక బరువు వంటి సమస్యలు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అందువల్ల అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.