Omicron Variant : కరోనా వైరస్ ప్రపంచంపై దాడి మొదలు పెట్టి రెండేళ్లకు పైగానే పూర్తయింది. ఇప్పటికీ ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియెంట్లతో కరోనా మనకు సవాల్ విసురుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఒమిక్రాన్ రూపంలో మళ్లీ వేగంగా కరోనా వ్యాపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియెంట్ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతోంది.
అయితే గత వేరియెంట్ల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువే కానీ.. ఈ వేరియెంట్ వల్ల చనిపోతున్నది చాలా తక్కువ మంది అని చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్ల సీరియస్ అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. చాలా మంది స్వల్ప లక్షణాలతోనే ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్నారు.
అయితే గతంలో పలు కరోనా వేరియెంట్లు ఏయే ఉపరితలాలపై ఎంత సేపు ఉంటాయనే విషయాన్ని సైంటిస్టులు వెల్లడించారు. తాజాగా ఒమిక్రాన్‌కు కూడా ఈ విషయాన్ని వారు చెబుతున్నారు. ఏయే ఉపరితలాలపై ఒమిక్రాన్ ఎన్ని గంటల పాటు ఉంటుందో సైంటిస్టులు తాజాగా చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఒమిక్రాన్ వేరియెంట్ ఏయే ఉపరితలాలపై ఎంత సేపు ఉంటుందనే విషయాన్ని జపాన్ సైంటిస్టులు తాజాగా అధ్యయనం చేసి తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. మనిషి శరీరంపై ఒమిక్రాన్ 21 గంటల పాటు ఉంటుందని తెలిపారు. చర్మంపై అన్ని గంటల పాటు ఈ వైరస్ జీవించి ఉంటుందని తెలిపారు. ఇక ప్లాస్టిక్ మీద ఒమిక్రాన్ సుమారుగా 8 గంటల పాటు సజీవంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు క్యోటో ప్రీ ఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
అయితే గత వేరియెంట్ల కన్నా మనిషి చర్మం, ఇతర ఉపరితలాలపై ఒమిక్రాన్ వేరియెంట్ సజీవంగా ఉండే సమయం పెరిగిందని, అందుకనే ఈ వేరియెంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తేల్చారు. కనుక ప్రజలందరూ కచ్చితంగా మాస్కులను ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్ తో శుభ్ర్ం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని అంటున్నారు.