OmiSure : దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వేరియెంట్‌ను ప్రత్యేకంగా గుర్తించేందుకు గాను భిన్న రకాల టెస్టులను చేయాల్సి వస్తోంది. అయితే ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు గాను ఓ సరికొత్త ఆర్‌టీ పీసీఆర్ కిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా ఆమోదం తెలిపింది.
టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ రూపొందించిన సదరు ఆర్టీ పీసీఆర్ కిట్‌కు ఒమిష్యూర్ గా నామకరణం చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ కిట్ ద్వారా ఇప్పటికే అనేక సార్లు టెస్టులు చేశారు. దీంతో ఈ కిట్ ద్వారా కరోనా సోకిన వారిలో ఒమిక్రాన్ వేరియెంట్‌ను సులభంగా గుర్తించవచ్చని నిర్దారించారు. దీంతో ఐసీఎంఆర్ ఈ కిట్‌కు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒమిష్యూర్‌ను లాంచ్ చేశారు.
ఈ కిట్‌లో ఉన్న ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ (ఎస్‌జీటీఎఫ్) అనే టెక్నాలజీ ద్వారా ఒమిక్రాన్ వేరియెంట్‌ను గుర్తించవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టాటా సంస్థ అమెరికాకు చెందిన థర్మో ఫిషర్ అనే కంపెనీ సహకారంతో ఈ కిట్‌ను రూపొందించింది.
కాగా ఒమిష్యూర్ కిట్‌ను ప్రభుత్వాలకు ఒక కిట్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయించనున్నారు. ఇతరులకు ఒక్కో కిట్‌ను రూ.240కి విక్రయించనున్నారు. దీంతో ఒమిక్రాన్ టెస్టులను సులభంగా, వేగంగా చేసేందుకు అవకాశం ఉంటుంది.