Covid 19 : ప్రపంచవ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి కరోనా సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. ఇది ఎన్నో కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికీ కరోనా బారిన పడి రోజూ ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు. ఒక వేవ్ ముగిశాక మరో వేవ్ వస్తూనే ఉంది. ఇక కొందరికైతే కరోనా రెండు, మూడు సార్లు కూడా సోకింది. కాగా ఆ వ్యక్తికి మాత్రం కరోనా ఏకంగా 78 సార్లు సోకింది. వింటానికే షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజమే.

ముజఫర్ కయసన్ అనే 56 ఏళ్ల వ్యక్తికి నవంబర్ 2020లో కరోనా సోకింది. అయితే అప్పటి నుంచి ఇతను చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ వస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ కరోనా సోకుతోంది. అంటే కరోనా అసలు ఆయనకు తగ్గలేదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే గత 14 నెలల నుంచి ఆయన చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటూనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు ఆయనకు 78 సార్లు ఇలా కరోనా సోకినట్లు రిపోర్టుల్లో వచ్చింది.
ఇలా సుదీర్ఘకాలం నుంచి కరోనాకు చికిత్స తీసుకుంటన్న వ్యక్తిగా ఆయన పేరుపొందాడు. కరోనా ఇలా సోకడం ఏమోగానీ.. తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని భోజనం చేయలేకపోతున్నానని, వాళ్లతో మాట్లాడాలన్నా.. కిటికీ నుంచి మాట్లాడాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన స్నేహితులకు తాను దూరమయ్యానని విచారం వ్యక్తం చేశాడు.
అయితే ముజఫర్‌కు వాస్తవానికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ ఉన్నవారి శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వీరికి రోగ నిరోధక శక్తి కూడా తక్కువే. కనుకనే కరోనా మళ్లీ మళ్లీ అటాక్ అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే అతనికి రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసిన్‌ను ఇస్తూ చికిత్స అందిస్తున్నామని అన్నారు. అయితే ముజఫర్ వెంట వెంటనే కరోనా బారిన పడుతుండడంతో ఆయనకు కరోనా టీకా ఇవ్వడం కూడా కుదరడం లేదని, అది ఇస్తే కోవిడ్ వ్యాప్తిని ఆపవచ్చని అంటున్నారు. మరి ఆయనకు నయమవుతుందా, లేదా.. చూడాలి.