10 Unhealthy Foods : మనకు మార్కెట్ లో అనేక రకాల చిరుతిళ్లు లభిస్తూ ఉంటాయి. చాక్లెట్స్, బిస్కెట్లు, చిప్స్, జ్యూస్ లు ఇలా అనేక రకాల చిరుతిళ్లు లభిస్తూ ఉంటాయి. ఈ చిరుతిళ్లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే నేటి తరుణంలో ఆరోగ్యంపై శ్రద్ద రావడంతో చాలా మంది చిరుతిళ్లను తీసుకోవడం తగ్గిస్తున్నారు. మైదాపిండి, నూనెలు, పంచదార వంటి వాటితో చేసే ఆహారాలను తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో మార్కెట్ లోకి బెల్లం, క్యాలరీలు తక్కువగా ఉండే చిరుతిళ్లు, చిరుధాన్యాలతో చేసే చిరుతిళ్లు అనేకం వచ్చి చేరాయి. చాలా మంది ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నమ్మి వీటిని కొనుగోలు చేసి తింటూ ఉన్నారు. అయితే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న కొన్ని చిరుతిళ్లు మేలుకు బదులుగా మన ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఈ ఆహారాలు మనకు మేలు చేస్తాయని భ్రమను మాత్రమే కలిగిస్తున్నాయి తప్ప వీటితో ఎటువంటి మేలు కలగదని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ఉద్దేశ్యంతో మనం తీసుకునే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు మార్కెట్ లో కొన్ని రకాల బిస్కెట్లు జీరో మైదా అనే ట్యాగ్ తో లభిస్తూ ఉంటాయి. అయినప్పటికి ఈ బిస్కెట్లను మైదాపిండి, చక్కెరలతో తయారు చేస్తారు. వీటిలో క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి మేలు కలగదు. అలాగే డైట్ అనే పేరుతో చివాడ్స్,మురుకులు, ఇతర క్రంచీ స్నాక్స్ లభిస్తూ ఉంటాయి. డైట్ అనే పేరు ఉండడంతో పాటు చాలా మంది వీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ డైట్ అనే పేరు ఉన్నప్పటికి ఈ స్నాక్స్ లో అధిక క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మార్కెట్ లో పాలల్లో కలిపి తీసుకోవడానికి వివిధ ప్లేవర్స్ తో పౌడర్స్ లభిస్తూ ఉంటాయి. వీటిలో చక్కెర తప్ప విటమిన్స్, డిహెచ్ ఎ వంటివి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయని వీటిని పాలల్లో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా మంది గ్రానోలా బార్స్ ను తింటూ ఉంటారు.
ఇవి కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కాదని వారు చెబుతున్నారు. అదే విధంగా చాలా మంది అల్పాహారంలో భాగంగా పాలల్లో కార్న్ ప్లేక్స్, సెరెల్స్ వంటి వాటిని వేసుకుని తింటూ ఉంటారు. వీటిని తృణ ధాన్యాలతో చేసినప్పటికి వీటిలో పంచదార ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది బ్రౌన్ బ్రెడ్ ను తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ బ్రెడ్ కలర్ చూసి మోసపోకూడదని గోధుమ రంగు కేవలం భ్రమను కలిగించడానికి మాత్రమే ఉపయోగిస్తారని దీనిని తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా మంది పాప్ కార్న్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ పాప్ కార్న్ తయారు చేయడానికి ఎక్కువగా ఉప్పు, బటర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కనుక బయట కొనుగోలు చేయడానికి బదులుగా వీటిని ఇంట్లోనే తయారు చేసి తీసుకోవడం మంచిది. అలాగే మనకు మార్కెట్ అనేక రకాల పండ్ల రసాలు ప్యాక్ చేసి లభిస్తూ ఉంటాయి.
వీటిలో పండ్ల రసం పరిమాణం ఎంత ఉంటుందో తెలియదు కానీ పంచదార, ప్రిజర్వేటివ్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయని అందుకే వీటిని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా మంది పీనట్ బటర్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇందులో నూనెలు, పంచదార ఎక్కువగా ఉంటుందని దీనిని తీసుకోవడం వల్ల అధికంగా క్యాలరీలు మన శరీరంలో వచ్చి చేరుతాయని నిపుణులుచెబుతున్నారు. అలాగే మనకు మార్కెట్ లో వెనీలా, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ ప్లేవర్స్ తో పెరుగు లభిస్తూ ఉంటుంది. అయితే ఇలా లభించే పెరుగు మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రక్టోజ్ కార్న్ సిరప్ తో తయారు చేస్తారని దీనిని తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.