చాలా మంది రోజూ వ్యాయామం చేస్తారు. కానీ సమయం లేదన్న కారణంతో కొందరు సాయంత్రం వ్యాయామం చేస్తారు. అయితే నిజానికి ఉదయం వ్యాయామం చేస్తేనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల రోజూ ఉదయం వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే…
1. అధిక బరువు
సాయంత్రం కన్నా ఉదయం వ్యాయామం చేయడం వల్లే బరువు వేగంగా తగ్గుతారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. 2015లో ఇ-బయో మెడిసిన్ అనే జర్నల్‌లో ఆ అధ్యయనం తాలూకు వివరాలను ప్రచురించారు. ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది, అది బరువును వేగంగా తగ్గిస్తుందని సైంటిస్టులు తెలిపారు.
2. ఆకలి
ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఏది పడితే అది తినకుండా ఉంటారు. 2012లో అమెరికాకు చెందిన బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీ పరిశోధకులు కొందరు స్త్రీ, పురుషులపై పరిశోధన చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఆకలి హార్మోన్. అందువల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా త్వరగా బరువు తగ్గవచ్చు.
3. ఉత్పాదకత
రోజూ ఉదయం 45 నిమిషాల పాటు సాధారణ నడక వంటి వ్యాయామం చేసినా చాలు వ్యక్తుల ఉత్పాదకత పెరుగుతుంది. అంటే వారు మరింత మెరుగ్గా పనిచేస్తారు. ఆఫీసుల్లో లేదా బయట ఎక్కడైనా సరే వారు శక్తిమేర పనిచేస్తారు. ఈ విషయాన్ని కూడా అధ్యయనాల ద్వారా వెల్లడించారు.
4. అనారోగ్య సమస్యలు లేని జీవితం
రోజూ ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు గుండెకు మంచి వ్యాయామం అయ్యేలా కార్డియో వంటివి చేస్తే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారని 2018లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. మొత్తం 2680 మందిపై సైంటిస్టులు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయానికి చెందిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలోనూ ప్రచురించారు.
5. ఏకాగ్రత
ఉదయం కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా తదుపరి 8 గంటల పాటు ఏకాగ్రత పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. దీని వల్ల పని మీద ధ్యాస ఉంటుంది. ఎక్కువ పని చేయగలుగుతారు. ఉద్యోగులకు ఇది మేలు చేస్తుంది.
6. నిద్ర
రోజూ ఉదయం వ్యాయామం చేసే వారికి రాత్రి పూట త్వరగా నిద్ర పడుతుంది. అలాగే మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్ర లేస్తారు. దీని వల్ల నిద్ర సమస్యలు ఉండవు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
7. హైబీపీ
హైబీపీ ఉన్నవారు రోజూ ఉదయం వ్యాయామం చేస్తే బీపీ గణనీయంగా తగ్గుతుంది. అమెరికాకు చెందిన అపలేషియన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.