Over Weight : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానమే ఈ సమస్య రావడానికి ప్రదాన కారణం. అధిక బరువు సమస్య నుండి బయట పడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కొందరు వివిధ రకాల డైటింగ్ ల పద్దతులను పాటిస్తూ ఉంటారు. కొందరు వివిధ రకాల పొడులను వాడుతూ ఉంటారు. వివిధ రకాల పానీయాలను తాగుతూ ఉంటారు. వీటితో పాటు కొన్ని రకాల సహజ మార్గాలను పాటించడం వల్ల కూడా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ నిమమాలను పాటించడం వల్ల బరువు తగ్గాలనుకునే మీ ప్రయత్నం మరింత సులభతరం అవుతుంది. ఈ సులభమైన నియమాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
బరువు తగ్గాలనుకునే వారు పాటించాల్సిన ఈ నియమాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కనుక రోజూ 10 నుండి 12 గ్లాసుల నీటిని తాగడం మంచిది. అలాగే రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. తగినంత నిద్రలేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో జీవక్రియల రేటు తగ్గుతుంది. కనుక రోజూ 8 గంటల పాటు నిద్రపోవడం మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది అల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తూ ఉంటారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. రోజూ తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి.
అల్పాహారం తినడం వల్ల శరీరం సరైన పద్దతిలో పయనిస్తుంది. అదే విధంగా ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ఖర్చవుతుంది. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. జీవక్రియల రేటు పెరుగుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా చిరుతిళ్లను, ప్యాకేజ్డ్ ఫుడ్ ను , సాస్ లను తీసుకోవడం తగ్గించాలి. బరువు తగ్గాలనుకునే వారు నెమ్మదిగా భోజనం చేయాలి. స్పూన్ తో లేదా ఫోర్క్ తో లేదా చేత్తో తినేటప్పుడు కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకుని తినాలి.
అలాగే తినేటప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆకలి తగ్గడంతో పాటు జీర్ణవ్యవస్థ మరింత చురుకుగా పని చేస్తుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. దీంతో మనకు త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ విధంగా రోజూ ఈ నియమాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మరింత త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.