ఆయుర్వేదం.. ఎంతో పురాతనమైన వైద్య విధానం. మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. మనం ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది. ఆయుర్వేద ప్రకారం, రోజూ ఉదయాన్నే ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర లేవాలి. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విషయంపై ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆయుర్వేద ప్రకారం రోజూ వేకువ జామున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం ఎందుకంటే.. ఈ సమయంలో మన చుట్టూ పరిసరాల్లో సాత్విక గుణాలు ఉంటాయి. దీంతో మన మనస్సు, శరీరానికి కావల్సిన శక్తి, తాజాదనపు అనుభూతి లభిస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఉదయం బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం వల్ల ధ్యానంతో అద్బుతమైన లాభాలను పొందవచ్చు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి, నేర్చుకునే స్వభావం పెరుగుతాయి. వారు చదువుల్లో రాణిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగులు అయితే పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెట్ట గలుగుతారు.
ఇక వ్యాయామం చేసేందుకు కూడా బ్రహ్మ ముహుర్తం చాలా అనుకూలమైంది. బ్రహ్మ ముహుర్తం సాధారణంగా సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ఉంటుంది. అది 48 నిమిషాల పాటు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది అనుభవిస్తున్న ఉరుకుల పరుగుల బిజీ జీవితం వల్ల బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవలేకపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
అయితే బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవలేకపోయినా కనీసం ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య అయినా రోజూ ఒకే సమయానికి నిద్ర లేస్తే మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శక్తి లభిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. జీర్ణశక్తి పెరుగుతుంది. జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
ఇక వాత సమస్యలు ఉన్నవారు సూర్యోదయానికి 30 నిమిషాల ముందు నిద్ర లేవాలి. అదే పిత్త సమస్యలు ఉన్నవారు సూర్యోదయానికి 45 నిమిషాల ముందు, కఫ సమస్యలు ఉన్నవారు సూర్యోదయానికి 90 నిమిషాల ముందు నిద్రలేవాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365