Almonds Side Effects : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. బాదంపప్పును చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. బాదంపప్పు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బాదంపప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. పిల్లలకు బాదంపప్పును ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది.
ఇలా అనేక రకాలుగా బాదంపప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పును అతిగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్లశరీరంలో విటమిన్ ఇ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ కొన్నిసార్లు విషంగా కూడా మారవచ్చు. శరీరంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రక్తస్రావం ఎక్కువవుతుంది. వివిధ రకాల ఇన్పెక్షన్ ల బారిన పడాల్సి వస్తుంది.
బాదంపప్పును అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. బాదంపప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలోకి అధిక క్యాలరీలు చేరుతాయి. దీంతో బరువు పెరుగుతారు. అంతేకాకుండా బాదంపప్పులో ఆక్సలైట్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగాఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించదు. బాదంపప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఈ విధంగా మనం వివిధ రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కనుక బాదంపప్పును ఎల్లప్పుడూ తగిన మోతాదులో తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.