Aloe Vera : మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. వాటిల్లో కలబంద కూడా ఒకటి. కలబంద చూడడానికి దట్టంగా చుట్టూ ముళ్లను కలిగి ఉంటుంది. లోపల జిగురు లాంటి తెల్లటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క ఎటువంటి భూమిలోనైనా పెరుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో చాలా సులువుగా మనం పెంచుకోవచ్చు. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక దీనిని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే సాధనాల్లో అలాగే ఆయుర్వేదంలో కూడా విరివిరిగా ఉపయోగిస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించడంలో, గుండెల్లో మంటను తగ్గించడంలో, అజీర్తి వంటి సమస్యలను అరికట్టడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కలబంద గుజ్జును గులాబీ నీటిలో కలిపి చర్మానికి రాయడం వల్ల చర్మం పై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. కాలిన గాయాలపై కలబంద గుజ్జును రాయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గు ముఖం పడతాయి. కొబ్బరి నీటిలో కలబంద గుజ్జును కలిపి చర్మం నల్లగా ఉన్న భాగాల్లో రాయడం వల్ల నలుపు తగ్గి ఆయా భాగాల్లో చర్మం తెల్లగా మారుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి కూడా కలబంద గుజ్జుకు ఉంటుంది. ఇన్ని రకాల సుగుణాలు ఉన్నప్పటికీ కలబంద వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కలబంద వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద గుజ్జును సరైన పద్దతిలో తీసుకోకపోవడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ దుష్ప్రభావాలు శరీరానికి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల విరేచనాల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారు, ఇతర సమస్యలకు మందులు వాడుతున్న వారు వాటితో పాటు కలబంద రసాన్ని తాగడం వల్ల ఇది మందులతో కలిసి శరీరంలో దుష్ప్రభావాలను అధికం చేస్తుంది. కలబందలో ఉండే లాక్సేటివ్ గుణాలు మందులను పని చేయకుండా చేస్తాయి. కలబంద రసం వల్ల చర్మంపై దద్దుర్లు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర సమస్యల బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. గర్భిణీ స్త్రీలు కలబంద రసానికి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. గర్బిణీ స్త్రీలు కలబంద రసాన్ని తాగడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే డెలివరీ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బాలింతలు కూడా కలబంద రసానికి దూరంగానే ఉండాలి. బాలింతలు కలబంద రసాన్ని తాగడం వల్ల అది తల్లి పాల ద్వారా శిశువుకు చేరి శిశువుకు విరేచనాలు అవుతాయి. అలాగే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిని దీనికి దూరంగా ఉంచడమే మంచిది. కలబంద రసాన్ని తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ లు అసమతుల్యతకు గురి అయ్యి శరీరం డీ హైగ్రేషన్ కు గురి అవుతుంది. కలబంద రసాన్ని తాగడం వల్ల గుండె పనితీరులో, గుండె కొట్టుకునే తీరులో మార్పులు, కండరాలు బలహీన పడి కండరాల నొప్పులు వంటి సమస్యలు కూడా వస్తాయి.
చిన్న పిల్లలు, యుక్త వయసులో ఉన్న వారు, షుగర్ వ్యాధికి మందులు వాడుతున్న వారు అలాగే ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ లను తీసుకుంటున్న వారు కలబంద రసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువ కాలం పాటు కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. అధిక మొత్తంలో ఈ కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల మూత్ర పిండ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వివిధ రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందికనుక ఈ కలబంద రసాన్ని ఉపయోగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.