ఆకలి అవుతుందంటే మన శరీరానికి ఆహారం కావాలని అర్థం. ఆహారం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఆకలి అవుతున్నా అలాగే ఉంటే తలనొప్పి, విసుగు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. కనుక ఆకలిని నియంత్రించుకోకూడదు. ఆకలి అవుతుంటే తప్పనిసరిగా భోజనం చేయాలి. అయితే కొందరికి ఎల్లప్పుడూ ఆకలి అవుతుంటుంది. దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రోటీన్లను సరిగ్గా తినకపోయినా ఆకలి బాగా అవుతుంది. ప్రోటీన్ల వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అవి తగ్గితే త్వరగా ఆకలి వేస్తుంది. కనుక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటుండాలి. దీంతో ఆకలిని నియంత్రించుకోవచ్చు.
2. నిద్ర సరిగ్గా పోకపోయినా ఆకలి ఎక్కువగా అవుతుంది. సరిగ్గా నిద్రించకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. అవి ఆకలి అయ్యేలా చేస్తాయి. దీంతో ఎక్కువ తింటాము. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి.
3. రీఫైన్ చేయబడిన పిండి పదార్థాలైన సోడా, క్యాండీ, బేకరీ పదార్థాలను ఎక్కువగా తింటున్నా, చక్కెర ఉండే ఆహారాలను ఎక్కువగా తింటున్నా.. ఆకలి ఎక్కువగా అవుతుంది.
4. రోజూ మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు కూడా ఉండేలా చూసుకోవాలి. వాటి శాతం తగ్గితే ఆకలి అవుతుంది.
5. రోజూ తగినంత నిద్ర మనకు అవసరం కనుక నీళ్లను కూడా తగిన మోతాదులో తాగాలి. లేదంటే ఆకలి బాగా అవుతుంది.
6. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. అదే ఫైబర్ తగ్గితే త్వరగా ఆకలి అవుతుంది. కనుక రోజూ తినే ఆహారాల్లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
7. తినే సమయంలో ఆహారంపై దృష్టి పెట్టాలి. లేదంటే ఎంత తింటున్నాం అనే విషయం తెలియదు. ఫలితంగా శరీరం ఆకలి సూచన చేస్తుంది. కనుక తినే ఆహారం మీద దృష్టి ఉంచాలి. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
8. బాగా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా ఆకలి అవుతుంది. కొందరికి వ్యాయామం చేస్తే ఎక్కువగా ఆకలి అవుతుంది. కనుక వారు ఆకలి తగ్గేందుకు ఆహారం తీసుకోవాలి. వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. దీంతో ఆకలి నియంత్రణలోకి వస్తుంది.
9. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల కూడా ఆకలి బాగా అవుతుంది.
10. ద్రవాహారాలను ఎక్కువగా తీసుకునేవారిలో కూడా ఆకలి ఎక్కువగా అవుతుంటుంది.
11. ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అయ్యేవారిలో కార్టిసోల్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల ఆకలి అవుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
12. కొన్ని రకాల మందులను వాడడం వల్ల కూడా ఆకలి బాగా అవుతుంది. క్లోజపైన్, ఒలొంజపైన్, యాంటీ డిప్రెసెంట్లు, మూడ్ స్టెబిలైజర్స్, కార్టికో స్టెరాయిడ్స్, యాంటీ సీజర్ డ్రగ్స్ ను వాడుతున్నవారికి సహజంగానే ఆకలి ఎక్కువగా అవుతుంది.
13. ఆహార పదార్థాలను వేగంగా తినేవారికి కూడా ఆకలి బాగా అవుతుంది.
14. డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు ఉన్నవారిలోనూ ఆకలి ఎక్కువగా అవుతుంటుంది.