Palli Chikki : చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఆహారాల్లో.. పల్లి పట్టీలు ఒకటి. పల్లీలను, బెల్లాన్ని కలిపి వీటిని తయారు చేస్తారు. అత్యంత సహజసిద్ధంగా పల్లి పట్టీలు తయారవుతాయి. కనుక ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవని చెప్పవచ్చు. ఇక వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పోషకాలు కూడా అందుతాయి. పల్లి పట్టీలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పట్టీల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అమితమైన శక్తి లభిస్తుంది. రోజూ శారీరక శ్రమ, వ్యాయామం అధికంగా చేసేవారు పల్లిపట్టీలను తింటే శక్తి బాగా లభిస్తుంది. దీంతో ఎంత పనిచేసినా అలసిపోరు. ఉత్సాహంగా ఉంటారు. అలాగే చిన్నారులకు వీటిని తినిపిస్తే క్రీడలు, చదువుల్లో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ఉండి రాణిస్తారు. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు.
పల్లిపట్టీల్లో ఫాస్ఫరస్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎదుగుతున్న చిన్నారులకు ఎంతగానో అవసరం. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కూడా పల్లిపట్టీలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
వీటిని తింటే శరీరానికి ఐరన్ అధికంగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. పల్లి పట్టీల్లో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. పల్లి పట్టీల ద్వారా విటమిన్ ఇ కూడా బాగానే లభిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.