Toilet : ఒకప్పుడు చాలా మంది ఇళ్లలో మరుగు దొడ్లు ఉండేవి కావు. దీంతో బయటే బహిర్భూమికి వెళ్లేవారు. అయితే దీని వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది. కనుక మరుగుదొడ్లను తప్పనిసరిగా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనకు వివిధ రకాల టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక చాలా మంది వెస్టర్న్ టైప్ టాయిలెట్లను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇళ్లలో ఈ తరహా టాయిలెట్లను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టాయిలెట్లను ఉపయోగించే వారు తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిములు మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చేరుతాయి. అవి వ్యాధులను కలగజేస్తాయి. ఇక ఇలా కావద్దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెస్టర్న్ టాయిలెట్లను ఉపయోగించే వారు టాయిలెట్ పూర్తయ్యాక మూతను ఓపెన్ చేసి ఉంచే ఫ్లష్ చేస్తుంటారు. చాలా మంది ఇలాగే చేస్తారు. కానీ ఇలా చేయడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. టాయిలెట్‌ను ఫ్లష్ చేసినప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు తిరుగుతూ టాయిలెట్‌లోకి వస్తాయి. అక్కడ ఉన్న మలంతో కలిసి అవి కిందకు వెళ్లిపోతాయి. అయితే నీళ్లపై పడే ఒత్తిడి వల్ల ఆ నీటిలోంచి సన్నని తేమ కణాలు గాలిలో పైకి లేస్తాయి. వాటిల్లో మలం కూడా కలిసే ఉంటుంది. ఈ కణాలను ఎరోసోల్ కణాలు అంటారు. ఇవి సుమారుగా 15 అడుగుల ఎత్తు వరకు పైకి వెళ్తాయి. అంటే టాయిలెట్ మొత్తం వ్యాపిస్తాయి అన్నమాట. ఈ క్రమంలోనే టాయిలెట్ సీట్‌కు మూత పెట్టకుండా ఫ్లష్ చేయడం వల్ల కణాలు పైకి వస్తాయి. అవి టాయిలెట్ నిండా వ్యాపిస్తాయి. ఇంకా చెప్పాలంటే బయటకు వచ్చి ఇంట్లోనూ వ్యాపిస్తాయి. ఇవి గాలిలో ఎక్కువ సేపు ఉంటాయి. కనుక మనకు వ్యాధులను కలగజేస్తాయి.
అయితే టాయిలెట్ సీట్‌కు ఉండే మూత పెట్టి ఆ తరువాత ఫ్లష్ చేయడం వల్ల ఇలా కణాలు పైకి రాకుండా చూసుకోవచ్చు. దీంతో వాటిల్లో ఉండే బాక్టీరియా, వైరస్, క్రిములు ఇల్లంతా వ్యాపించవు. దీని వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావు. కనుక ఇకపై వెస్టర్న్ టాయిలెట్లలో ఫ్లష్ చేసే సమయంలో తప్పనిసరిగా మూత పెట్టండి. ఇక ఆ మూతను ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచండి. అవసరం అయితేనే తీయండి. ఇలా చేయడం వల్ల టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది. ఇంట్లోనూ బాక్టీరియా, వైరస్‌లు చేరవు. దీంతో శుచిగా, శుభ్రంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.