Wheat Flour : ప్రస్తుత తరుణంలో చాలా మంది డైటింగ్ పేరిట రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటున్నారు. అధిక బరువు తగ్గేందుకు, షుగర్ ఉన్నవారు చపాతీలను తినడం అలవాటుగా చేసుకున్నారు. అయితే అంతా బాగానే ఉంది.. కానీ.. మనం వాడే గోధుమ పిండి గురించే వచ్చింది సమస్యంతా.. అవును.. గోధుమ పిండితో చపాతీలను చేసుకుని తింటున్నాం.. కానీ మనం వాడుతున్న పిండికి ఉపయోగించిన గోధుమలు.. ముడి గోధుమలు కావు. అంటే పొట్టుతో ఉండవు.
గతంలో మన పూర్వీకులు ఏ ధాన్యం వాడినా.. పొట్టుతో సహా దంచి ఉపయోగించేవారు. దీంతో ఆ పొట్టులో ఉండే ఫైబర్ వల్ల ఎన్నో పోషకాలు వారికి అందేవి. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ప్రస్తుతం మనకు లభిస్తున్న అనేక ధాన్యాలు, వాటితో తయారు చేసే పిండిలో ఫైబర్ ఉండడం లేదు. కారణం.. పొట్టు లేకుండానే వాటితో పిండి తయారు చేస్తున్నారు. ఇలా గోధుమలను కూడా ఉపయోగించి పిండి తయారు చేస్తున్నారు. ఆ పిండిలో ఫైబర్ కొంచెం కూడా ఉండదు. దీని వల్ల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.
డైటింగ్ పేరిట బరువు తగ్గాలని చెప్పి, షుగర్ కంట్రోల్ కావాలని చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తింటున్నారు. కానీ వాస్తవానికి ఆ పిండిలో ఫైబర్ ఉండదు కనుక.. అలాంటి చపాతీలను తిన్నా వేస్ట్. పైగా అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని నిపుణులు అంటున్నారు.
అలాంటి ఫైబర్ లేని చపాతీలను తినడం వల్ల బరువు తగ్గరు సరికదా.. బరువు ఇంకా పెరుగుతారు. పైగా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. శరీరంలో కొవ్వు చేరుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువవుతాయి. కనుక ముడి గోధుమలతో మనమే స్వయంగా పిండి పట్టించుకుని దాంతో చపాతీలను చేసుకుని తినడం మంచిది.
గోధుమలపై ఉండే పొట్టుతోనే వాటిని పిండిలా పట్టించుకోవాలి. ఆ పిండితో చపాతీలను చేసుకుని తింటేనే మేలు జరుగుతుంది. అలా కాకుండా మార్కెట్‌లో మనకు లభించే పిండితో చపాతీలను చేసుకుని తింటే.. అంతే సంగతులు.. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
అయితే కేవలం గోధుమలు మాత్రమే కాదు, చిరు ధాన్యాలు, ఇతర తృణ ధాన్యాలను కూడా పొట్టుతో సహా ఉపయోగించాలి. పొట్టుతో సహా పిండి పట్టించి తింటేనే పోషకాలు మనకు లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అన్ని రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందుతారు.