ఉబ్బస వ్యాధికి ప్రధమ చికిత్స అత్యవసరం. ఉబ్బసం కలవారు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు – తరచుగా వైద్యుడిని సంప్రదిస్తే వ్యాధి తీవ్ర స్ధాయికి రాదు. పొగ వచ్చే ప్రదేశాలలో ముక్కు, నోరు భాగాలను శుభ్రమైన గుడ్డతో మూసివేయండి. ట్రావెలింగ్ లో నోస్ మాస్క్ ధరించండి. ఒక ఇన్ హేలర్ దగ్గర వుంచుకొని మందులు సమయానికి తీసుకోండి. ఉబ్బసం వస్తున్న సూచనలు కనిపిస్తే వీటిని తప్పక వినియోగించండి. ప్రధమ చికిత్సగా ఏం చేయాలి?
ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఉబ్బసం దాడి చేస్తే ఏ కారణంగా వచ్చిందో తెలుసుకొని దానికి దూరంగా వుండండి. విశ్రాంతిగా కూర్చోండి. గాఢమైన శ్వాస తీసుకోండి. ఆందోళన చెందవద్దు. ఆందోళన చెందితే పరిస్ధితి మరింత అదుపుతప్పుతుంది. హాయిగా వున్నానని భావిస్తూ పూర్తిగా రిలాక్స్ అవండి. వదులు దుస్తులు ధరించండి. దుప్పటా, లేదా షాల్ వంటివి శరీరంపై వుంటే వాటిని తొలగించండి.
మీకు బాగా వున్నదని భావించేవరకు ప్రతి రెండు నిమిషాలకు రెండు పఫ్ లు ఇన్ హేలర్ తీసుకోండి. పది సార్లు పీల్చండి. ఉపశమనం కలగకపోతే వైద్యుడిని సంప్రదించండి. మీ చుట్టుపక్కలవారికి మీ పరిస్ధితి తెలియజేయండి. నోటితో చెప్పలేకుంటే, కాగితంపై వ్రాసి తెలుపండి. మీ దగ్గర ఇన్ హేలర్ లేకుంటే వేడినీరు ఉపయోగించండి. త్వరగా ఇన్ హేలర్ కొరకు ప్రయత్నించండి. లేదా ఆస్పత్రికి వెళ్ళి సత్వర వైద్యం పొందండి.